Oct 26,2023 21:54

వినతిపత్రం అందజేస్తున్న మీటర్‌ రీడర్లు

* మంత్రి బొత్సకు మీటర్‌ రీడర్ల వినతి
ప్రజాశక్తి - కవిటి: 
నెలవారీ వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్‌ మీటర్‌ రీడర్లు కోరారు. ఈ మేరకు మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయకు గురువారం ఇచ్ఛాపురంలో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 3,800 మంది మీటర్‌ రీడర్లు 15 నుంచి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లు వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సరైన వేతనం, ఉద్యోగ భద్రత లేక తమ కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జి.ఆనందరావు, డి.భాస్కరరావు, పి.లోకనాథం, కె.మనోహర్‌, పి.సంతోష్‌ కుమార్‌ తదితరులున్నారు.