అనంతపురం కలెక్టరేట్ : భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారిని ఎదిరించిన ఉద్యమవీరుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ ఎమ్.గౌతమి తెలిపారు. మంగళవారం నాడు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ గాయత్రి దేవి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అన్నా దొర, గిరిజన సంఘాల నాయకులు అల్లూరి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు. తెలుగుజాతి చరిత్రలో అల్లూరి సీతారామరాజు సాగించిన సాయుధ పోరాటం అపూర్వ ఘట్టంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.










