May 04,2023 11:01

అనంతపురంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

      అనంతపురం కలెక్టరేట్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తం అయ్యింది. బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సిపిఎం, సిఐటియు, వ్యకాసం, రైతు తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్రం, దానిని అడ్డుకోకుండా మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలను పోలీసులు బలవంతంగా అణచివేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం రాత్రి నుంచి ఎక్కడికకక్కడ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను గృహ నిర్బంధం చేశారు. బుధవారం ఉదయం తపోవనం నుంచి ర్యాలీగా వస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రభుత్వం పోలీసుల చేత నిరసనలను భగం చేయించే కుట్ర చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతలో పోలీసుల జులూం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఉప సంహకరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో సిఐటియు, సిపిఎం చేపట్టిన రాస్తారోకో కార్యక్రమాన్ని అడ్డుకుంటూ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులూం ప్రదర్శించారు. బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' ప్రయివేటీకరణ ఆపాలంటూ తపోవనం జాతీయ రహదారిలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాంగా జిల్లాలో రాస్తారోకోలకు సిద్ధమైన సిఐటియు, సిపిఎం నాయకులను పోలీసులు ఉదయం నుంచి గృహనిర్భంధాలు, అక్రమ అరెస్టులు చేసి అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల అడ్డకుంలను దాటుకుని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు తపోవనం సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు.తపోవనం సర్కిల్‌కు చేరుకుని ప్రజల ఆస్తి విశాఖ ఉక్కును పరిరక్షించాలని నినాదాలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా నాయకులను ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ లాగిపడేశారు. నాయకులను బలవంతంగా అరెస్ట్‌ చేశారు. వాహనాల్లో ఇష్టం వచ్చినట్లు ఎత్తిపడేసి జులూం ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు నాయకులు సృహతప్పి కింద పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. 30 నిమిషాల పాటు జాతీయ రహదారిలో ఉద్రిక్తతల నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల నడుము ఉద్యమకారులను అరెస్ట్‌ చేసి మూడవ, నాల్గవ పట్టణం పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయమే రాజీవ్‌ కాలనీ ఉప సర్పంచి మసూద,్‌ ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు వన్నూరు వలి ఖాన్‌, సిఐటియు నగర అధ్యక్షులు బాబు, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజులను అరెస్టు చేశారు. అరెస్టులు చేసే సమయంలో సిపిఎం, సిఐటియు కార్యకర్తలు ఉక్కుమాదే, దానిపై హక్కు మాదే, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపకపోతే సహించేది లేదంటూ హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజాసంఘాలు కలుపుకుని ఐక్యంగా ప్రజా ఉద్యమంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం నిర్బంధ చర్యలకు, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని ఎటువంటి త్యాగానికైనా సిపిఎం, ప్రజా సంఘాల, కార్యకర్తల సిద్ధమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్ర కుమార్‌, సిపిఎం నగర కార్యదర్శి వి. రామిరెడ్డి అన్నారు. బిజెపి అన్ని ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పజెప్పడం లాభాలు వస్తున్న పరిశ్రమలని బహిరంగ మార్కెట్లో ఉన్నదానికంటే 80 శాతం తక్కువగా విక్రయిస్తుండటం దుర్మార్గంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాట ఆడుతుండం దుర్మార్గంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటుకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఏ ప్రయోజన కోసం బిజెపికి అనుకూలంగా మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు బహిరంగంగా చీకటి ఒప్పందాలను తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు కట్టపడి కట్టుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మడం అంటే తమ తల్లిని అమ్మడమే అవుతుందన్నారు. అరెస్టైన వారిలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, చీమల ప్రకాష్‌రెడ్డి, ప్రసాద్‌, ఎన్టీఆర్‌ శ్రీనివాసులు, ఎర్రిస్వామి, లక్ష్మీనారాయణ, ఆటో యూనియన్‌ నాయకులు ఆదినారాయణ, అజామ్‌బాషా, గఫూర్‌, నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, జీవరత్నం, రాజు తదితరులు పాల్గొన్నారు.