Jun 27,2023 22:05

రక్తదానం చేస్తున్న వారితో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు

       అనంతపురం కలెక్టరేట్‌ : సామాజిక సేవలో భాగంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఉద్యమ స్పూర్తిని కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు తెలిపారు. మంగళవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిఐటియు ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ శత జయంతి సందర్భంగా సిఐటియు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మానవతా రక్తదాతల పెద్దలు తరిమెల అమర్నాథ్‌ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఓబులు హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మానవతా రక్తదాతల సంఘం తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతర కషి చేస్తున్న సిఐటియు సామాజిక, సేవా కార్యక్రమాల్లో కూడా ముందు భాగాన నిలుస్తోందన్నారు. కార్పొరేట్‌ వైద్యం వచ్చిన తర్వాత ప్రయివేట్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తం కోసం వేల రూపాయలు లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ ప్రమాదం బారిన పడ్డవారు రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సాటి మానవులుగా రక్తం ఇచ్చి వారి ప్రాణాలు కాపాడుదామన్నారు. రక్తం ఇస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే అనుమానాలు సరికావన్నారు. రక్తదానం చేస్తే ఆరోగ్యనికి మంచిదన్న విషయం తెలుసుకోవాలన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రక్తదానం శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్‌ వీరభద్రయ్య మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అలవాటు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లడ్‌ బ్యాంక్‌ పవన్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఏజి.రాజమోహన్‌, సిటిజన్‌ ఫోరం కార్యదర్శి శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌, సిఐటియు జిల్లా కోశాధికారి గోపాల్‌, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, సురేంద్ర, సిఐటియు నాయకులు శ్రీనివాసులు, నాగభూషణం, ప్రకాష్‌రెడ్డి, ఆదినారాయణ, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌, శ్రీరంగ, మంజునాథ్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు తిరుమలేష్‌, ఎర్రిస్వామి, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.