Nov 15,2022 23:29

ఉద్యానవనశాఖ అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించండి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఉద్యానపంటల సాగుకు అదనంగా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేందుకు అవకాశం ఉన్న ఉద్యానపంటల సాగుకు సంబంధించిన అవగాహనను తీసుకురావాలని జిల్లాకలెక్టర్‌ యం. హరినారాయణన్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మధుసూదన్‌ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్‌లో ఉద్యానశాఖకు సంబంధించి పథకాల అమలుతీరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ ఉద్యానవన శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్యాన పంటలసాగుకు రైతులు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను వినియోగిస్తున్నారని, దీనితో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేలా రైతులకు సచివాలయాల్లోని హార్టికల్చర్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల ద్వారా మరింత అవగాహన తీసుకురావలసిన అవసరం కలదన్నారు. జిల్లాలో కూరగాయల సాగును కూడా ప్రోత్సహించాలని సూచిస్తూ ఉద్యాన పంటల సాగు క్రింద ఉన్న విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తమిళనాడుకు చెందిన క్రిష్ణగిరిలో టమాటో, మ్యాంగో, కోకోనట్‌కు సంబంధించి సోలార్‌డ్రయర్లతో డ్రీహైడ్రేషన్‌ సాగుకు సంబంధించిన పద్ధతులను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై మరింత అవగాహన తీసుకుని వచ్చేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎక్కువ మంది ఉపాది అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ఈ పథకంను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు డిఆర్డిఏ, మెప్మా శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో 1,51,000 ఎకరాలలో ఉద్యాన పంట సాగు ఉండగా అందులో 1,24,000 ఎకరాలు పండ్ల తోటల పెంపకం కలదని ఇందులో భాగంగా 24మండలాల్లో 52,000 హెక్టార్లలో మామిడి పంట సాగు అవుచున్నదని, టమోటా సాగు విస్తీర్ణం కూడా ఎక్కువ కలదని, రాష్ట్రీయ కషి వికాస్‌ యోజన ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అండ్‌ లైవ్లీ హుడ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రాజెక్ట్‌, మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో ఏపిఎంఐపి ద్వారా 9,800హెక్టార్లలో పంట సాగుకు అవసరమైన బిందు, తుంపర్ల సేద్య పరికరాలు అందజేసేందుకు ఆమోదం తెలిపారని, ఉద్యాన శాఖ అధికారి కలెక్టర్‌ కు వివరించారు.