
*ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట
*టిడిపి కార్యాలయం ముందు నాయకుల బైఠాయింపు
*పలువురు అరెస్టు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్:తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నల్లజెండాలతో నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయం నుంచి అరసవల్లి కూడలి వరకు ప్రదర్శనగా ఆ పార్టీ నాయకులు బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులను నెట్టుకుంటూ టిడిపి నాయకులు ముందుకు వెళ్లే క్రమంలో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లకీëదేవి తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జగన్ నియంతృత్వ పోకడలను తిప్పికొట్టాలి
రాష్ట్రంలో జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని, ఈ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు అండగా ప్రతి కార్యకర్తా నిలవాలన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ద్వారా టిడిపి ప్రభుత్వ కాలంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కల్పించామని, ఈ కేంద్రాలకు కేటాయించిన నిధులు సంబంధిత అధికారుల పర్యవేక్షణలో విడుదల చేశామన్నారు. ఈ వ్యవహారంలో నాటి అధికారులు, ప్రస్తుత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారన్నారు. వారిని ప్రశ్నించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అవినీతిపరుడైన జగన్, అందరిపైనా ఆ మచ్చ వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, జెడ్‌పి మాజీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.