ప్రజాశక్తి-బొమ్మనహాల్ మండల పరిధిలోని ఉద్దేహాల్ గ్రామంలో సుమారు 7000 జనాభా ఉంది. అయితే గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 కి.మీ. దూరంలోని దేవగిరి క్రాస్ సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో బోరుబావి వేసి గ్రామానికి తాగునీరు సరఫరా చేసేవారు. అయితే బోరుబావుకి సంబంధించిన విద్యుత్ మోటారు మూడు రోజుల క్రితం కాలిపోవడంతో బయటకు తీసి మరమ్మతుల కోసం పంపించారు. దీంతో బండూరు రోడ్డులోని దళితవాడ, తిమ్మాలాపురం రోడ్డు, సచివాలయం సర్కిల్, జిల్లా పరిషత్ హైస్కూల్ సర్కిళ్లలోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటారు కాలిపోయిన తర్వాత ఒకరోజు మాత్రమె ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేశారాని, ఆ తర్వాత కనబడకుండా పోయారన్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో నీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు క్యాంపులో ఇంటికి చేతికి పంపులు ఉన్నాయని, అయితే గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో ఎలాంటి నీటి సౌకర్యాలు లేక కుళాయి నీటి పైనే ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు. వేదవతి నది నుంచి నీరు సరఫరా చేసే మోటారు గతేడాది నుంచి పనిచేయడం లేదని, దీని వల్ల నీటి సమస్య తలెత్తింని పేర్కొంటున్నారు.
వివరణ: ఈ విషయమై ఎంపీడీవో షకీలా బేగంను వివరణ కోరగా.. మోటారు మరమ్మతులు చేయించి త్వరలోనే బిగించి గ్రామానికి నీరు అందిస్తామన్నారు.
కాలిపోయిన మోటార్ పైపులు బయటకు తీసిన దశ్యం










