Sep 26,2023 22:00

స్పీకర్‌ తమ్మినేనికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

* స్పీకర్‌ను కోరిన పిపిఎస్‌, మత్స్యకార నాయకులు
ప్రజాశక్తి - సోంపేట: 
థర్మల్‌ వ్యతిరేక ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పర్యావరణ పరిరక్షణ సమితి, మత్స్యకార ఐక్యవేదిక సభ్యులు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యాన పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్‌ వై.కృష్ణమూర్తి, టి.రామారావు, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సత్యరాజ్‌ అమరావతిలోని సెక్రటేరియట్‌లో స్పీకర్‌ను మంగళవారం కలిశారు. ఎన్‌సిసి థర్మల్‌ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమంలో పోలీసులు 725 మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. కేసుల్లో విద్యార్థులు, యువత ఎక్కువగా ఉన్నారని, కేసుల కారణంగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఎత్తివేసి వారి భవిష్యత్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోంపేటలోని బీలలో బహుళజాతి పరిశ్రమలు నిర్మించాలంటూ అప్పటి టిడిపి ప్రభుత్వం ఇచ్చిన 329 జిఒను సైతం రద్దు చేయాలని కోరారు. థర్మల్‌ విద్యుత్కేంద్రం కోసం ఎన్‌సిసి కంపెనీకి కేటాయించిన భూముల్లో చేపల చెరువులు ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ గట్లు తొలగించాలని ఆర్‌డిఒ ఆదేశించినా నేటికీ తొలగించలేదన్నారు. వాటిని వెంటనే తొలగించాలని కోరారు.