- *ప్రజల హక్కుల కాలరాత... ప్రతిపక్షాల అణిచివేత
- ప్రమాదంలో ప్రజాస్వామ్యం
- అనపర్తి సంఘటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జిలు ధరించి కలలకు గంతలు కట్టుకుని తెదేపా నాయకుల నిరసన
- అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్రంలో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా పాలన సాగుతున్నదని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తూ.గో జిల్లా అనపర్తిలో సభ నిర్వహించకుండా పోలీసులే అడ్డుకోవడన్ని నిరసిస్తూ పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్నిఅందజేశారు. అనంతరం నల్ల బ్యాడ్జిలు ధరించి కళ్ళకి గంతలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు RBC కుట్టి, గిరిబాబు మరియు గ్యాస్ నాగరాజు లు ప్రశాంగించారు. అనపర్తిలో ఉదయం సభకు అనుమతిని ఇచ్చి సాయంత్రం అనుమతి లేదంటూ సభను అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులే టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి వారిపై లాఠీ చార్జీ చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించారన్నారు. జెడ్ ప్లస్ రక్షణ ఉన్న చంద్రబాబు నాయుడు వస్తుంటే ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పోలీసులే ఆయన కాన్వాయికి అడ్డంగా రోడ్డుపై ధర్నాకు కూర్చున్నారన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవని స్వతంత్రంగా పనిచేయాల్సిన పోలీసులు, అధికార యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని దేశంలో ఎక్కడా లేని విధంగా మూడున్నరేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన, చట్టాల ధిక్కరణ జరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కాలరాస్తూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీ నేతల వరకు అందరిని వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా జీవో నెం.1 తెచ్చి నియంతృత్వంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి పౌరునికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని కానీ వైసీపీ పాలనలో మాత్రం రాష్ట్రంలో ప్రజలు కనీసం నోరు తెరచి తమ అభిప్రాయాన్ని చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా పోలీసుల చేత అడ్డంకులు సృష్టిస్తున్నారని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల చేత శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇంతకుఇంత పరిహారం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెదేపాకు వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేక ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నదని, భవిష్యత్ లో మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్, ఖాజా పీర్, మదన్, శ్రీధర్, లోకేష్, రూరల్ నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, రామూర్తి, సుబ్రహ్మణ్యం పిళ్లయి, గంగవరం నాయకులు గిరిధర్ గోపాల్,యుగంధర్,అరుణ్, అశోక్, రవి, తదితరులు పాల్గొన్నారు.










