Jun 25,2022 15:10

ప్రజాశక్తి-చిత్తూరు జిల్లా (పలమనేరు) :  రాష్ట్రంలో మైనారిటీలకు మూడు నామాలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు ఖాజాపీర్ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ....ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో ముస్లిం, మైనారిటీలకు చేసిందేమి లేదని పంగ నామాలు మాత్రమే పెట్టారని ఎద్దేవా చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దుల్హన్, రోషిణి, షాదీమహల్ నిర్మాణాలు, విదేశీ విద్య, ఇమామ్, మౌజన్ లకు వేతనాలు, మసీదులు నిర్వహణ నిధులు ఇలా ప్రతి పథకాన్ని నేడు రద్దు చేసి మైనారిటీలను నట్టేట్లో ముంచేస్తున్నారన్నారు. దుల్హన్ పథకానికి డబ్బులు లేని కారణంగా ఆ పథకాన్ని ఆపివేసామని సాక్ష్యాత్తూ కోర్టులో చెప్పడం చూస్తుంటేనే మైనారిటీల అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతోందని అన్నారు.  మైనారిటీల ఓట్లతో గద్దెనెక్కి ఆ మైనారిటీలనే నేడు విస్మరించడం ఈ ప్రభుత్వ పథనానినికి నాంది అని జోస్యం పలికారు. మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిందెవరో,  భవిష్యత్లోనూ పనిచేసే వారెవరో మైనారిటీలు ఆలోచించాలని కోరారు. అనంతరం జిల్లా మైనారిటీ అధికార ప్రతినిధి ముబారక్ మరియు పట్టణ ఉపాధ్యక్షులు మాభాష లు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో  మైనారిటీ నాయకులు చాంద్ బాష, రహీమ్ బాషా , ఇమామ్, హనీఫ్,జిలాని,సాదిక్, నదీమ్,బాబాజాన్, అస్లాం,సయ్యద్,పర్వీన్ లతో పాటు పలమనేర్ పట్టణ నాయకులు RBC కుట్టీ, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడు, గ్యాస్ నాగరాజు, మదన్,శ్రీధర్,శ్రీనివాసులు, కిషోర్, నాగరాజు, సుబ్రహ్మణ్యం, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.