- టిడిపి ప్రతినిధి సుధాకర్ రెడ్డి
ప్రజాశక్తి - వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): జిడి నెల్లూరు నియోజక వర్గం టిడిపి టిక్కెట్టుపై సోషియల్ మీడియా, కొన్ని పత్రికల్లో వచ్చే వార్తలు కేవలం ఊహాగానాలు తప్ప అందులో వాస్తవాలు లేవని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి గురువారం స్పష్టం చేశారు.ఒక ప్రకటన ద్వారా ర ఆయన తెలిపిన వివరాలు... కొంత మంది అత్యుత్సాహంతో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కథనాలు సృష్టిస్తున్నారని చెప్పారు. టిడిపి విలువలు, క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. డబ్బు ఇచ్చిన వారికి టిక్కెట్టు ఇచ్చే సంస్కృతి టిడిపికి లేదని తెలియజేశారు. విస్వశనీయత, పనితనం, సేవా గుణం, ప్రజల్లో పలుకుబడి, పోరాట పటిమ లాంటి అంశాల ఆధారంగా అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు నిజాయితీకి, నిస్పక్షపాతానికి మారుపేరన్నారు.1983 ఎన్నికల్లో తొలి సారిగా పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర టిడిపిదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన వ్యక్తికే చంద్రబాబు జిడి నెల్లూరు టిక్కెట్టు ఇస్తారని చెప్పారు. టిక్కెట్టు ఎవరికి ఇచ్చినా అందరూ కలసి అతని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. టిక్కెట్టు ఆశించే వారు చంద్రబాబును కలిసి అభ్యర్థించడం సహజమని, అంత మాత్రాన కలసిన ప్రతి వారికి టిక్కెట్టు రాదని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ఒక పద్దతి ప్రకారం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అన్ని విషయాలు విశ్లేషించి తగిన అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెప్పారు. తాను ఎవరికి మద్దతు తెలపలేదని, టిక్కెట్టు ఎవరికి ఇస్తే వారి గెలుపుకు కృషి చేస్తానని సుధాకర్ రెడ్డి చెప్పారు.










