- నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన జగన్
- కమీషన్ల కక్కుర్తి తో యువత ఉపాధికి గండి
- అవకాశాలు లేక వ్యసనాలకు బానిసలై పాడవుతున్న యువత జీవితాలు
- ఇకనైనా జగన్ యువతను మోసగించడం మాని... ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
- విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి డిమాండ్
ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్రంలో యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జనవరి 1 న జ్యాబ్ క్యాలెండర్ అంటూ ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక, స్వయం ఉపాధికి ప్రభుత్వం నుంచి సహకారం అందక యువత భవిత ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేక రాష్ట్రంలో గత మూడేళ్లలో 21,575 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. C.M.I.E నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్ నాటికి 4.0 శాతం ఉన్న నిరుద్యోగిత శాతం డిసెంబర్ 2022 నాటికి 7.7 శాతానికి పెరిగిందన్నారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని నాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, కానీ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. కమీషన్ల కక్కుర్తితో మూడున్న రేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంతో 15 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడితే జగన్ రెడ్డి అమరావతిని సైతం నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ హయాంలో 2 సార్లు డీఎస్సీ నిర్వహించి 18 వేల ఉద్యోగాలిచ్చామని, కానీ ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న జగన్ రెడ్డి ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. ఐటి అభివృద్ధితో 34 వేల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 64,000 ఉద్యోగాలిచ్చామని జగన్ రెడ్డి ఐటి కంపెనీలు తరిమేసి, అక్రమ కేసులతో స్కిల్ డెవలప్మెంట్ ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టులు ఇస్తానన్న జగన్ రెడ్డి ఎన్ని కాంట్రాక్టులిచ్చారని ఎంతమందిని కాంట్రాక్టర్లుగా తయారు చేశారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ప్రతినెల 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి (ముఖ్యమంత్రి యువనేస్తం) ఇస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పోరేషన్ల యువతకు సబ్సిడీ, బ్యాంకు రుణాలతో స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు. 25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందో చెప్పాలని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ మద్యం వ్యవసనాలకు బానిసలుగా మారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నెం. 1 స్థానంలో ఉందని (ఎన్సీబీ) నార్కోటిక్ కంట్రోట్ బ్యూరో నివేదిక చెబుతుండగా, మరో వైపు 2021 లో గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై ఏపీలో 571 మంది యువత ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ (నేషనల్ క్లైంబ్యూరో) నివేదిక చెబుతోంన్నారు.
వీటన్నింటికి కారణం జగన్ అసమర్థ, చేతకాని పాలనేనని జగన్ ఇకనైనా యువతను మోసం చేయటం మాని వెంటనే ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి , ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.










