ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా విఫలం అయ్యాయని సిఎం జగన్ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కారణమని ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆయన ఆఫీసులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత వారం రోజుల్లో నెల్లూరు, ఏలూరు, ప్రకాశం జిల్లా, విశాఖ, పులివెందులల్లో హత్యలు, అఘాయిత్యాలు, యాసిడ్ దాడి, అరాచకాలు వీటికి నిదర్శనం అన్నారు. రేపల్లెలో 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి అంటించడం దుర్మార్గం అన్నారు. టిడిపి హయాంలో ఫ్యాక్షనింజంను అణిచివేయగా జగన్ తిరిగి పోషిస్తున్నారు అని చెప్పారు. సిఎం సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం దళిత బిడ్డ ను దారుణంగా హత్య చేసారని చెప్పారు. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబంకు రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రేపల్లెలో తన అక్కను ఏడిపిస్తున్నాడని హెచ్చరించిన అన్నను దారుణంగా పెట్రోల్ పోసి కాల్చడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా అదుపు తప్పాయో అర్ధం అవుతుంది అన్నారు.










