
*మెప్మా పీడీ కుమార్
ప్రజాశక్తి - ఆమదాలవలస:మండలంలోని జగ్గుశాస్త్రులపేట వద్ద నిర్మాణంలో ఉన్న 528 ఎపి టిడ్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మెప్మా పీడీ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణ మహిళా సామాజిక వనరుల కేంద్రంలో మెప్మా సిబ్బంది, వార్డు సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆదేశాలలో భాగంగా రానున్న అక్టోబర్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా టిడ్కో అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగానే డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో గహాలను లబ్ధిదారులకు అందించనున్నట్లు వివరించారు. 365, 430 చదరపు అడుగుల ఇళ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల మేరకు బ్యాంకు రుణం ఒప్పందం తక్షణమే చేయాలని, లేదా ఆ మేరకు వారే నగదును టిడ్కోకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జగనన్న కాలనీ లే అవుట్లలో ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులు ముందుకురావాలని సూచించారు. సమీక్షలో భాగంగా జగనన్న తోడు, పిఎం నిధి తదితర మెప్మా ప్రగతి లక్ష్యాలపై సమీక్షించారు. సమీక్షలో హౌసింగ్ ఎఇ డి.సన్యాసిరావు, మెప్మా సిబ్బంది బి.రామారావు, వి.విజయకుమారి, స్థానిక సిబ్బంది, పట్టణ, స్లం సమాఖ్యల ఆర్పీలు పాల్గొన్నారు.