సమగ్ర సర్వే ప్రక్రియను వేగవంతం చేయండి
స్థానిక సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ భరత్
ప్రజాశక్తి- రామకుప్పం: తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేసేందుకు రైతులకు అవగాహన పెంచాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే సేవలను మరింత చేరువచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం మణేంద్రం సచివాలయంను ఆకస్మిక తనిఖీచేసి సచివాలయ పరిధిలో అర్హుల, అనర్హుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రైతులకు ఆధునిక వ్యవసాయసాగు పద్ధతులను సంబంధించి రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు, ఇతరత్రా రైతుసేవలను అందించేందుకు ఆర్‌బికెలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా అందించే సేవలను విస్తతం చేయాలన్నారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి
సచివాలయ పరిధిలో 270ఎకరాలలో సిరికల్చర్ సాగు అవుతున్నదని 32 షెడ్లు ప్రస్తుతం పనిచేస్తున్నవని, పట్టు గూళ్లను కుప్పం, పలమనేరు పట్టు గూళ్ళు మార్కెట్‌లో అమ్మడం జరుగుతున్నదన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మల్బరీ సాగు మీద ఎక్కువ మంది రైతుల ఆధారపడి ఉన్నారని, ఈ పంటకు కూడా ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేయడం జరిగిందని సిరికల్చర్ అసిస్టెంట్ కలెక్టర్‌కు వివరించారు. సచివాలయపరిధిలోని రెండు గ్రామాలైన మణేంద్రం, అత్తికుప్పంలో కలసి 2262.88 ఎకరాలలో డ్రోన్‌ఫ్లై సర్వే పూర్తయినదని, మణేంద్రంలో గ్రౌండ్ ట్రూథింగ్ పనులు జరుగుతున్నాయని సర్వే అసిస్టెంట్ కలెక్టర్ వివరించారు.
స్థానిక సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ భరత్
89 పెద్దూరు నుండి అంబురు వరకు, రామాపురం తాండా నుంచి సింగసముద్రం వరకు, దేవరాజపురం నుండి వీర్నమల వరకు రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ భరత్ కలెక్టర్‌ని మర్యాద పూర్వకంగా కలిసి తెలిపారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వీరితో పాటు జెడ్‌పిటిసి నితిన్ రెడ్డి కూడా స్థానిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పర్యటనలో కలెక్టర్ వెంట కుప్పం ఆర్డీఓ శివయ్య, రామకుప్పం తహశీల్దార్ సురేష్, ఎంపిడిఓ రాధాకృష్ణ, ఎంపిపి సుబ్రహ్మణ్యం, వైసిపి కన్వీనర్ బాబురెడ్డి, కో-కన్వీనర్ చంద్రరెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయండి
బైరెడ్డిపల్లి: సంక్షేమపథకాలను అర్హులందరికీ చేర్చేందుకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పనిచేయాలని కలెక్టర్ ఎం.హరి నారాయణన్ సూచించారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తొలుత బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి వద్ద రూ.40లక్షలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్ నిర్మాణ పనులను పరిశీలించి ఈగోడౌన్‌ను త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొనిరావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నందిని, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జెసి.కష్ణ. సర్పంచ్ విసి.వెంకటేష్. పంచాయతీ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
వికోట: మండల పరిధిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న జగనన్న హౌసింగ్ లే అవుట్‌లలో గహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పాపేపల్లిలొని జగనన్న లేఅవుట్లను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలనీలలో ఇళ్లు మంజూరైనా ఇంకా నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులచేత త్వరితగతిన ఇళ్లు నిర్మించే విధంగాచర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీల్లో మౌలికవసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పాముగానిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలు మారాయని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్‌రెడ్డి, తహశీల్దార్ సీతారాం, ఎంపీడీఓ బాలాజీ, హౌసింగ్ ఏఈ రామచంద్ర, ఎంఈవో చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు
కుప్పం: కుప్పం ఏరియా ఆసుపత్రిని మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్, వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మరింత వైద్యసేవలను అందుబాటులో తెచ్చేందుకు ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.










