
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం: జిల్లాలో చేపడుతున్న సంక్షిప్త ఓటర్ల జాబితా కార్యక్రమం త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఇందులో అలసత్వం వద్దన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర వివరాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫారం-8కు సంబంధించిన వివరాలను సేకరించి మూడు నెలలైనా కొందరు అధికారులు పూర్తి చేయకపోవడంపై ఆరా తీశారు. ఓటర్ల వివరాల సేకరణకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఈలోగా ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలను హెచ్చరించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తదితరులు పాల్గొన్నారు.