Mar 24,2023 20:57

పోస్టర్లను విడుదల చేస్తున్న మేయర్‌ మహమ్మద్‌ వసీం, నాయకులు

        ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మహాయజ్ఞంగా చేపడుతున్న మీభూమి మాహామీ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్‌ మహమ్మద్‌ వసీం సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్‌ ఛాంబర్‌లో శుక్రవారం మీ భూమి మా హామీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. నగరంలో కూడా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలతో సమన్వయం చేసుకుని వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా సిఎం జగన్‌ సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో నగరంలోని సర్వే నెంబర్లు క్రోడీకరణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి, విజయ భాస్కర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి కమిషనర్‌ రమణారెడ్డి, కార్పొరేటర్లు అబుసాలేహా, చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, మునిశేఖర్‌, వైసిపి నాయకులు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, ఖాజా, రామాంజనేయులు, నగరపాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులుతోపాటు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.