
* జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం: జైలులో ఉన్న ముద్దాయిల కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కమిటీ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలులో ఉన్న ముద్దాయిల కేసుల పరిష్కారానికి పోలీసులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో అలసత్వం వద్దని సూచించారు. సమావేశంలో అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, ఫణికుమార్, భాస్కరరావు, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి అనురాధ, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, జిల్లా జైలు సూపరింటెండెంట్ నబిఖాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, పాలకొండ ఎస్‌డిపిఒ జి.వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.