ప్రజాశక్తి-బొమ్మనహాళ్ మండల పరిధిలోని నాలుగు రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడతలో చేసిన భూ సర్వే తూతూ మంత్రంగా పూర్తి చేశారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మండలంలోని బండూరు, ఉద్దేహాల్, ఉంతకల్, కొలగానహల్లి గ్రామాల్లో భూ సర్వే చేసినా రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారానికి నోచుకోలేదన్న భావన రైతుల్లో నెలకొంది. పొలాలకు వెళ్లే దారులు, రైతుల మధ్య విభేదాలు, ఆన్‌లైన్లో ఎక్కువ, తక్కువ కొలతలను సరి చేయకుండా, అధికారులు కేవలం పొలాల మధ్య సరిహద్దు రాళ్లు నాటి వెళ్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ కెమెరా ప్రకారం రికార్డు నమోదు చేయకుండా సర్వే ఎలా చేస్తారని పేర్కొంటున్నారు. పాసు పుస్తకంలో ఉన్న దాని కంటే క్షేత్రస్థాయిలో భూమి తక్కువ ఉన్న, బలవంతులైన రైతులు ఆ భూమిని కబ్జా చేసిన రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని బాధితులు పేర్కొంటున్నారు. ఇరుపక్షాలు గట్టిగా ఉన్నచోట గ్రూపుగా ఏర్పాటు చేసి నాలుగు హద్దులు చూపించి వెళ్లారు. ఈ భూములను రైతులు మళ్లీ సబ్ డివిజన్ చేసుకోవాలంటే గొడవ పడాలి లేదా కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అధికారులు గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు అనుకుంటే కొత్త సమస్యలను సష్టించి వెళ్లారని కొందరు రైతులు వాపోతున్నారు. భూమి ఉన్నా ఆన్‌లైన్‌లో నమోదుకాకపోవడం, ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా భూమి ఎక్కడుందో తెలియకపోవడం, భూమి ఒక చోట ఉంటే ఆన్‌లైన్‌లో ఇంకో నంబరు బీ లెటర్‌లో చూపించడం, తదితర సమస్యలు ఉన్న రైతులను ఒప్పించి మార్పులు చేయడం లేదా పరిష్కారం చూపాల్సిన అధికారులు అవేమీ పట్ట్టనట్లు కేవలం సరిహద్దు రాళ్లునాటి వెళ్లడం ఏంటని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ భూములు సాగు చేసే వారు, సీలింగ్ పొలాలు సాగు చేసే రైతుల కష్టాలు వర్ణనాతీతం. మిగులు భూములు గుర్తించి పేదలకు పంపిణీ చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కొందరు నాయకులు పలుకుబడిన ఉపయోగించి ఆన్‌లైన్‌లో పట్టాలు నమోదు చేసుకుంటున్నారని, అసైనెమెంట్ పేరుతో నిరుపేదల భూములు కాజేస్తున్నారని, ఎక్కువ శాతం దళితులే భూములు నష్టపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టాదారు పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి పేరు ఉండటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించే వారు లేకపోలేదు. జాతీయ జెండా ముద్రించి ఉంటే బాగుండేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు చిత్తశుద్ధితో భూసర్వే చేసి రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని, మిగులు భూములు గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని మండల రైతులు కోరుతున్నారు.
వివరణ: ఆయా విషయాలపై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడమే మా కర్తవ్యం అని సమాధానం ఇచ్చారు.
పొలాల వద్ద వేసిన సర్వే రాళ్లు










