తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై టిడిపి ధ్వజం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో శనివారం తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై ధ్వజమెత్తారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సతీమణి బీద జ్యోతి, పార్టీ శ్రేణులతో కలిసి బురదలో నడుస్తూ, వాహన దారులను పలకరిస్తూ, రోడ్డు దుస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ తుమ్మలపెంట రోడ్డును చూస్తుంటే నరకానికి దారి ఇది.. అన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం వేలాదిమంది ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారని, నేషనల్ హైవేకు దగ్గరగా ఉందని, మత్స్యకారులకు అత్యవసరమైన రోడ్డుగా, అలాగే పర్యాటక కేంద్రానికి వెళ్లే రోడ్డు కాబట్టి దానిని త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంపై ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారో అర్థం కావడం లేదని, అభివృద్ధిపై శాసనసభ్యులు మాట్లాడలేక టిడిపి అభివృద్ధి అడ్డుకుంటుందని చేతకాని మాటలు మాట్లాడడం సమంజసం కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్నవ రవిచంద్ర, పోతుగంటి శ్రీకాంత్, దావులూరు దేవకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, కుల్లూరు అశ్విని, టిడిపి లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










