Jul 20,2023 08:44

ఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న మహిళా ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు

           అనంతపురం కలెక్టరేట్‌ : మహిళా ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ తులసీచంద్‌పై కొన్ని అసాంఘిక శక్తులు దేశద్రోహిగా ముద్రవేస్తూ, దాడికి యత్నిస్తున్న వారిని వెంటనే అరెస్ట్‌ చేసి శిక్షించాలని మహిళా ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం నాడు అనంతపురం ఎస్పీ కె.శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డాక్టర్‌ ప్రసూన, వి.సావిత్రి, పద్మావతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌గా తులసీచంద్‌ పనిచేస్తూ వ్యవస్థలో లోపాలను ఆమె ఛానల్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని చెప్పారు. ఆమె ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా కొందరు రాజకీయాలు అంటగట్టి దేశద్రోహిగా చిత్రించే కుట్ర జరుగుతోందన్నారు. మతోన్మాదం, పాలకుల అవినీతి, అక్రమాలు, ఆ పార్టీల విధానాలతో సమాజానికి జరిగే నష్టాలను ఆమె విశ్లేషిస్తోందన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొన్ని రాజకీయ పార్టీలు ఆమె దేశద్రోహం చేస్తోంది అన్నట్లుగా దాడులు చేసే కుట్రలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెపై అశ్లీల పోస్ట్‌లు, మార్పింగ్‌లు పెట్టి హింసకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తామనే పద్ధతుల్లో బెదిరిస్తున్నారని తెలిపారు. ఇదివరకే బెంగుళూరులో గౌరిలంకేష్‌ అనే మహిళా జర్నలిస్టును సమాజం కోల్పోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ తులసీచంద్‌ లాంటి సమాజహితం కోరే పాత్రికేయురాలిని పొగొట్టుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. ఆమెకు మహిళా సమాజం అండగా ఉంటుందన్నారు. తులసీచంద్‌పై ఎలాంటి దాడులు జరిగినా గ్రామానికి ఒక తులసీచంద్‌ తయారవుతారన్న సత్యాన్ని మతోన్నాద, దుర్మార్గ రాజకీయ పార్టీల నాయకులు తెలుసుకోవాలని చెప్పారు. ఆమెపై జరుగుతున్న విద్వేష ప్రచారాలను తక్షణమే నియంత్రించేలా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు రాజేశ్వరి, రామాంజినమ్మ, పార్వతి, లక్ష్మిదేవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.