May 01,2023 21:59

తోపుదుర్తి మహిళా సహకార పాల డెయిరీను ట్రయిల్‌ రన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి

        ప్రజాశక్తి-ఆత్మకూరు   అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు జగనన్న లేఅవుట్‌ పక్కన ఏర్పాటు చేసిన తోపుదుర్తి మహిళా సహకార పాల డెయిరీ ప్రారంభానికి అంతా రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సతీమణి మనోరమ, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలిసి సోమవారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ డెయిరీ ఏర్పాటుతో తొలి విడతలో రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల మంది మహిళా పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఏడాది కాలంలోనే మరో 20 వేలమందికి లబ్ధి కలగనుంది. అంటే 30 వేల మంది మహిళా రైతులకు మేలు జరగనుంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ డెయిరీని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల నుంచి రోజూ 1.20 లక్షల లీటర్ల పాల సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, స్టోర్‌ డీలర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..