Mar 02,2022 21:13

చెట్లను నెలకూల్చిన దృశ్యం.

తరిగిపోతున్న వృక్షసంపద
ప్రజాశక్తి- పలమనేరు
కొందరు వృక్షాలను రంపాలతో కోసి ఇటుకల బట్టీలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. మరికొందరు చెట్లను నరికి కలపను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ డబ్బు దండుకుంటున్నారు. మండలంలో ఇంత జరుగుతున్నప్పటికీ వృక్షసంపదను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీనిపై పలువురు సమాచారం అందిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. దీన్ని బట్టిచూస్తే వాల్టా చట్టం అమలుకు అధికారులు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా చట్టాలను తుంగలో తొక్కుతూ చెల్లను అమ్మి సొమ్ముచేసుకుంటున్న కొందరు అక్రమాలకు అటవీశాఖ అధికారులు అండగా ఉన్నారనే విమర్శలు లేకపోలేదు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, మానవాళికి వృక్షాలే ఆధారం అని ప్రభుత్వం చెబుతోందే తప్ప వాటి సంరక్షణకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇకనైనా ఫారెస్టు అధికారులు స్పందించి చెట్లతో పాటు పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.