May 22,2023 21:58

ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ నరసింగప్ప

        ప్రజాశక్తి-గుంతకల్లు   పట్టణ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ యు.నరసింగప్ప హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకూ 1వ, 2వ పట్టణాల సీఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది, ట్రాఫిక్‌ సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్‌లపై అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేసిన వాహనాలు, షాపులు ముందు ఉంచిన వస్తువులు క్లియర్‌ చేయిస్తూ, దుకాణాల యజమానులకు ట్రాఫిక్‌పై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించాలన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. అలా ఇస్తే ఏమైనా జరిగితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ లోడింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫాం ధరించాలని, ఆటో సీరియల్‌ నంబర్‌ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 1వ, 2వ పట్టణ సిఐలు రామసుబ్బయ్య, గణేష్‌,స్పెషల్‌ పార్టీ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.