ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు రోజు తాము శాంతియుతంగా నిరసన తెలిపితే తమపై అక్రమంగా కేసు బనాయించడం అన్యాయమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఈఏడాది మార్చి 19న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి విజయం సాధించినా, ఎన్నికల అధికారి ఫలితం ప్రకటించకుండా వెళ్లిపోయారన్నారు. నిబంధనల ప్రకారం ఫలితాన్ని ప్రకటించాలని తాము ఆరోజు ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆందోళన చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అప్పట్లో పోలీసులు తమకెలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఆరోజు ఘటనపై తనను ఎ1 ముద్దాయిగా చేర్చినట్లు తాజాగా 41-ఎ నోటీసు అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు ఇచ్చారని తెలిపారు. తనతో పాటు టిడిపి ముఖ్య నాయకులు బి.కె. పార్థసారథి, పరిటాల సునీత, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, పరిటాల శ్రీరామ్, కడప శ్రీనివాసరెడ్డి, రామగోపాలరెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును జగన్ సర్కారు నిరంకుశంగా కాలరాస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పోలీసు నిర్బంధాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా దెబ్బతిస్తూ, అరాచక పాలన సాగిస్తున్న సీఎం. జగన్ రెడ్డికి ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము చేసే పోరాటాల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు.
మాజీమంత్రి కాలువ శ్రీనివాసులుకు నోటీసు అందజేస్తున్న కానిస్టేబుల్










