Nov 03,2022 21:46

తప్పులు లేకుండా అర్బన్‌ రీసర్వే
నగర కమిషనర్‌ అరుణ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

చిత్తూరు అర్బన్‌ రీసర్వే కార్యక్రమాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను వేగవంతం చేయడంపై కమిషనర్‌ అరుణ గురువారం మధ్యాహ్నం వార్డు కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రణాళిక కార్యదర్శుల సమీక్షలో భాగంగా రీసర్వే అంశంపై మార్గనిర్దేశం చేశారు. నగరంలో పోస్టర్లు, బ్యానర్లు అనుమతులు లేకుండా ఏర్పాటు చేయకూడదని ఈ విషయంలో వార్డు ప్రణాళిక కార్యదర్శులు అన్ని వార్డుల పరిధిలో నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఇష్టారాజ్యంగా అంటించిన పోస్టర్లను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల నేపథ్యంలో పారిశుధ్య కార్యక్రమాలపై వార్డు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులు ప్రత్యేక దష్టి సారించాలని, క్లాప్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు యూజర్‌ ఛార్జీల వసూలు పూర్తిచేయాలని ఇందుకోసం డ్వాక్రాసభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు క్రమం తప్పకుండా హాస్టల్స్‌, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. వార్డు పరిధిలో పన్నుల వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని వార్డు అడ్మిన్‌ కార్యదర్శులను ఆదేశించారు. వార్డుపరిధిలో గ్రాడ్యుయేట్లను గుర్తించి, ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు ఫారాలు అందించాలన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని, విధినిర్వహణలో వార్డు కార్యదర్శులు యూనిఫాం కచ్చితంగా ధరించాలన్నారు.