Oct 18,2023 20:54

సమావేశంలో మాట్లాడుతున్న గణపతిరావు

* క్షుణ్ణంగా ఓటర్ల జాబితాల పరిశీలన
* జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ఒక వ్యక్తి ఐదు అంతకుమించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే రిజిస్ట్రేషన్లపై కఠినంగా వ్యవహరించాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ఆదేశించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వినతులు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ ఛాంబరులో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లను తొలగించాలంటూ వచ్చే తప్పుడు ఫిర్యాదులపై నిశిత పరిశీలన ఉండాలన్నారు. ఇసిఐ సూచనల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు స్థానిక బిఎల్‌ఒకు ఒకేసారి, ఒకేరోజులో పది దరఖాస్తులను బల్క్‌లో ఫైల్‌ చేయొచ్చని చెప్పారు. క్లయిమ్‌ల అభ్యంతరాలను దాఖలు చేసే మొత్తం వ్యవధిలో బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ 30 కంటే ఎక్కువ దరఖాస్తులు ఫైల్‌ చేసినట్లయితే, క్రాస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరిగా ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బిజెపి జిల్లా కోశాధికారి ఇప్పిలి సీతారాజు, కాంగ్రెస్‌ నాయకులు డి.గోవింద మల్లిబాబు, బిఎస్‌పి నాయకులు రామారావు, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు, డిటి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.