Jul 09,2023 20:32

విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

      ప్రజాశక్తి-రాయదుర్గం    సిఎం జగన్‌ తప్పుడు హామీలతో పదే పదే ప్రజల్ని మోసం చేస్తున్నాడని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములపై పదేపదే కుంభకోణాలు చేసి ఏవిధంగా డబ్బులు దండుకుంటున్నారో అదేవిధంగా పచ్చి అబద్ధాలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో జీడిపల్లి, బిటిపి పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. రెండేళ్ల కిందట రాయదుర్గంలో జగన్‌ ఇచ్చిన హామీని తుంగలో తొక్కి, నిన్నటి కళ్యాణదుర్గం సభలో రూ.208 కోట్లు విడుదల చేస్తానని ప్రకటించడం విడ్డురంగా ఉందన్నారు. 2021 జులై 8న రాయదుర్గం సభలో జీడిపల్లి, బిటి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం భూసేకరణను 60 రోజుల్లో పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తీరా రెండేళ్లు గడిచాక భూసేకరణ పనులకు రూ.208 కోట్లు ప్రకటిస్తే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 'కాళ్లుకాలిన పిల్లిలాగా' చప్పట్లతో ఆనందించడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. వైసిపి నాయకులు చెప్పే మాటలకు, వాస్తవానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు 3 నెలల్లో రూ.150 కోట్లతో బిటిపికి కృష్ణాజలాలు తెస్తానని చెప్పిన కల్లి బొల్లి మాటలు మర్చిపోయావా అంటూ విప్‌ కాపును నిలదీశారు. నాలుగేళ్లు తర్వాత మంత్రి ఉషశ్రీ చరణ్‌, కాపు రామచంద్రారెడ్డి మొద్దు నిద్ర లేచినట్లుందన్నారు. రూ.208 కోట్లతో భూసేకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో, బిటిపి ఎత్తిపోతల కాలువ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ పథకంపై మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికు కనీస అవగాహన లేదన్నారు. జగన్‌రెడ్డి పర్యటనలో తెల్లవారుజాము నుంచి బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సరైన అల్పాహారం కూడా అందించలేని దద్దమ్మ ప్రభుత్వమిదని దుయ్యబట్టారు. జగన్‌ సభకు బస్సుల్లో తరలించిన డ్వాక్రా మహిళలకు అట్ట ముక్కల్లో భోజనం పెట్టిన చెత్త సర్కారును ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. అంతేగాకుండా కర్ణాటక మద్యం ఏరులై పారిందన్నారు. జగన్‌ రెడ్డి బ్రాండ్లపై నమ్మకం లేక కర్ణాటక రాష్ట్రం నుండి వేల కొద్దీ టెట్రా ప్యాకెట్లలో మద్యాన్ని సరఫరా చేశారన్నారు. గుట్టలుగా ఖాళీ ప్యాకెట్లు దర్శనమిచ్చాయంటేనే వైసిపి నాయకులు ఏ స్థాయిలో మద్యాన్ని సరఫరా చేసి ఉంటారో ఉహించవచ్చన్నారు. దగాకోరులంతా కలిసి ప్రజలసొమ్ముతో నిర్వహించిన దండగమారి సభగా కాలవ అభివర్ణించారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, రాయదుర్గం మండల కన్వీనర్‌ హనుమంతు, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు సన్నన్న, ఇనాయత్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మహబూబ్‌బాషా, ఎస్సీ సెల్‌ మల్లి, శీనా, తదితరులు పాల్గొన్నారు.