సిసి కెమెరాలతో 'కమాండ్ కంట్రోల్'
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
ప్రజల కదలికలు, వాహనాల రాకపోకలు, నేరస్తుల కదలికలు, తప్పిపోయిన వ్యక్తులు, సొత్తు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బైక్ దొంగతనాలు, తప్పిపోయిన బ్యాగుల పై నిఘా ఉంచే లక్ష్యంతో 2015న కమాండ్ కంట్రోల్ ప్రారంభించబడింది. ప్రస్తుతం, కమాండ్ కంట్రోల్ లో పనిచేస్తున్న విభాగాలు 1) డయల్-100, 2) వీడియో వాల్ వాచ్, 3) రేడియో ఆపరేటర్, 4) ఎల్‌హెచ్‌ఎంఎస్, 5 (బాడీ వోర్న్ కెమెరా), 6) టివి వాచర్, 7) దిశా ఎస్‌ఒఎస్ (సేవ్ అవర్ సోల్) మరియు 8) మ్యాట్రిక్స్ సిసి కెమెరాలు.
సంబందిత విభాగపు ఇంచార్జులు ఎప్పటికప్పుడు ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులను పర్యవేక్షిస్తూ, సంబందిత పోలీసు స్టేషన్ హౌస్ ఆఫిసర్లకు తగు సమాచారం అందించి వాటిపై అధికారుల సూచనలను అందజేస్తున్నారు. ఎస్‌హెచ్‌ఒలు వాటిని పరిశీలించి చట్ట రిత్యా తగు చర్యలు తీసుకొంటారు. గతంలో చిత్తూరు పట్టణంలో సుమారు 50 ప్రాంతాల్లో 123 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది.ప్రస్తుతం చిత్తూరు పట్టణంలో 31 ముఖ్యమైన జంక్షన్లు/పాయింట్లను కవర్ చేయడం కోసం అదనంగా 100 సిసికెమెరాలు ఏర్పాటు చేశారు. 183 మాట్రిక్స్ సిసి కెమెరాలు 104 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. చిత్తూరు, పరిసర ప్రాంతాలలో, 185 ప్రదేశాలలో, 406 సిసి కెమెరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా చిత్తూరులోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను సిసి కెమెరాలతో కవర్ చేయడం ద్వారా మొత్తం పట్టణం కమాండ్ కంట్రోల్ యొక్క నిశిత పరిశీలన, నిఘాలో ఉంది. సిసి కెమెరాల ద్వారా నేరస్థులను పట్టుకోవడానికి, పోగొట్టుకొన్న సొత్తును రికవరీ చేయడానికి, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
సిసి కెమెరాల ద్వారా పట్టుకొన్న కొన్ని ముఖ్యమైన కేసులు
నేర పరిశోధన, నేరస్తులను గుర్తిచండంలో సీసి కెమరాల పాత్ర కీలకంగా మారుతోంది. నగరంలో ఎక్కడ నేరం జరిగినా వెంటనే సీసి కెమెరాల్లో రికార్డు అయిన సమచారం ద్వారా నేరానికి పాల్పడిన విధానం ఎవరు? ఎంత మంది పాల్గొన్నారనే విషయాలను పోలీసులు గుర్తిస్తున్నారు. పోలీస్‌శాఖ సీసి కెమెరాలను నగరంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసింది. ప్రతి కదలికను కమాండ్ కంట్రోల్ రూంలో రికార్డు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసింది. పోలీస్ కంమాండ్ కంట్రోల్ రూం ద్వారా సీసి కెమెరాల్లో రికార్డు అయిన సమాచారంతో యాదమరి హై రోడ్డు పక్కన జరిగిన హోస్ బ్రేకింగ్, బివిరెడ్డి కాలనీలో డికె. బద్రినారాయణ ఇంట్లో చోటు చేసుకున్న చోరి. చోరికి గురైన మోటరు సైకిల్ కేసులు చేధించడం, చైన్ స్కాచింగ్ కేసులు, కట్టమంచి నందు హోస్ బ్రేకింగ్, గాంధీ బొమ్మ వద్ద చోటు చేసుకున్న హత్యకేసును పోలీసులు సీసి కెమెరాల ద్వారా నింధితులను అరెస్టు చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే ద్విచక్రవాహనదారులను కమాండ్ కట్రోల్ రూమ్ సీసి కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలనాలు పంపుతున్నారు. ధర్నాలు, హర్తాలు జరుగుతున్న సమయాల్లో సీసి కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులను అల్టర్ చేస్తోంది.










