Oct 17,2023 22:22

సరుబుజ్జిలి మండలం శ్యామలాపురం వద్ద వంశధార కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క

* శివారు భూములకు చేరని వంశ'ధార'
* కాలువల్లో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క
* నిధులు ఇవ్వని ప్రభుత్వం
* రైతులకు సమాధానం చెప్పుకోలేక అధికారుల అవస్థలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి
      జిల్లాలో అసలే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వంశధార నీటిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కాలువల నుంచి సాగునీరు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 16న పలాస ప్రాంత రైతులు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌కు స్పందనలో వినతిపత్రం అందించారు. సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయారని కలెక్టర్‌ సీరియస్‌ అయి వంశధార ఎస్‌ఇకి మెమో సైతం జారీ చేశారు. వాస్తవ పరిస్థితులను విస్మరించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువల్లో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్క తొలగింపునకు నిధులను చాలా ఆలస్యంగా విడుదల చేశారు. కాలువల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో, శివారు భూములకు సాగునీరందకపోయిన అంశం ఈ ఏడాదీ పునరావృతమైందన్న చర్చ నడుస్తోంది.

  హిరమండలం గొట్టాబ్యారేజీ ద్వారా వంశధార కుడి, ఎడమ కాలువల కింద 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇందులో ఎడమ కాలువ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, కుడికాలువ ద్వారా 80 వేల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. కాలువల పరిస్థితి దయనీయంగా ఉండడంతో, నిర్ధేశించిన ఆయకట్టుకు నీరందడం లేదు. ముఖ్యంగా శివారు భూములకు నీరందని పరిస్థితి ఏటా పునరావృతమవుతోంది. సాగునీటి కాలువలు చాలా బలహీనంగా ఉండడం, పెద్దఎత్తున గుర్రపుడెక్క పేరుకుపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వంశధార ఎడమ కాలువ సామర్థ్యం 2,450 క్యూసెక్కులు కాగా, కాలువ గట్లు బలహీనంగా ఉండడంతో 1800 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కుడి కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా, 500 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
నిధుల విడుదలలో జాప్యం
వంశధార కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క సకాలంలో తొలగించకపోవడం వల్లే శివారు భూములకు సాగునీరు అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటిని విడిచిపెట్టే సమయానికే గుర్రపుడెక్క తొలగించాల్సి ఉండగా ఆగస్టులో చేపట్టారు. వంశధార ఎడమ, కుడి కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపునకు రూ.90 లక్షలు అడిగితే, కలెక్టర్‌ రూ.40 లక్షలు విడుదల చేశారు. అదీ జూలైలో విడుదల చేయడంతో, పనులు పూర్తిస్థాయిలో చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
జంగిల్‌ క్లియరెన్స్‌ పనులూ పెండింగే
నీటితీరువా నిధులతో చేపట్టే కేటగిరి-ఎ పనులూ పెండింగ్‌లో ఉన్నాయి. వంశధార ఎడమ కాలువకు సంబంధించి జంగిల్‌ క్లియరెన్స్‌, గట్లను పటిష్టపరచడం వంటి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. టెక్కలి డివిజన్‌లో 30 పనులకు రూ.1.61 కోట్లు, నరసన్నపేట డివిజన్‌లో 29 పనులకు రూ.69 లక్షలు కేటాయించారు. పనుల కోసం టెండర్లను పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండోసారి టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కిందట చేపట్టిన పనులకు రూ.4.16 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో, టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది.
షట్టర్ల సమస్యకు పరిష్కారమేది?
వంశధార శివారు భూములకు షట్టర్ల కుంభకోణం కేసు అడ్డంకిగా మారింది. 2009లో సిఐడి నమోదు చేసిన కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. వంశధార అధికారులు పలు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదు. ఈ ఏడాదీ కొత్తగా షట్టర్లను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. శిథిలావస్థలో ఉన్న షట్టర్లతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు పరిష్కరించలేకపోయారు.