Sep 09,2023 22:38

మంత్రి ధర్మాన ప్రసాదరావు

* దర్యాప్తునకు చంద్రబాబు సహకరించాలి
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా దర్యాప్తునకు చంద్రబాబు సహకరించాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు చట్ట ప్రకారమే అరెస్టు చేశారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని చంద్రబాబు చెప్తున్నారని, అటువంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా చట్టాన్ని గౌరవించాల్సి ఉంటుందని, నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోవాలన్నారు. వాస్తవానికి ఎఫ్‌ఐఆర్‌ 2012లో నమోదైందని, చంద్రబాబు అంటున్నట్లు సిఐడి అరెస్టు చేయాలంటే ఎప్పుడో చేసేదని చెప్పారు. స్కాంతో సంబంధం లేకపోతే కోర్టులో నిరూపించుకుని బయటకు రావాలే తప్ప అనవసరమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహారావుపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో విచారణకు సహకరించి నిర్దోషిగా బయటపడ్డారని గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థ దురుద్దేశంతో అరెస్టు చేస్తే అరెస్టు అక్రమమా, సక్రమమా అనేది కోర్టు పరిశీలిస్తుందని చెప్పారు. పోలీసులపై చంద్రబాబు ఆరోపణలు చేయకుండా విచారణ సంస్థకు సహకరిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.