Aug 24,2023 22:12

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

       అనంతపురం ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా ఓట్ల తొలగింపుపై తాను సాగించిన పోరాటానికి ఫలితం దక్కిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపుపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని మార్గదర్శకాల ప్రతులను చూపించారు. గురువారం ఉదయం అనంతపురం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉరవకొండలో నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను తొలగించారని తెలిపారు. దీనిపై తాను సాగించిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఒక స్సష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఎక్కడైనా ఓట్లు తొలగిస్తే వాటిపై ఎన్నికల సిబ్బంది, అధికారులు విధిగా క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన తరువాతనే తొలగించాలని పేర్కొందని గుర్తు చేశారు. తనకు అధికారులపై ఎటువంటి కోపమూ, కక్ష లేదని చెప్పారు. తప్పు చేస్తే శిక్ష ఈ విధంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసానని తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏమి జరిగిందో గత కొన్ని రోజులుగా చూస్తున్నామన్నారు. ఇప్పటికే ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు, ఎనిమిది మంది దిగువ స్థాయి సిబ్బందిపై ఎన్నికల సంఘం వేటు వేసిందన్నారు. ఇది కేవలం చర్య మాత్రమేనన్నారు. ఇంకా ఇది పూర్తవలేదన్నారు. ఎన్నికల సంఘం విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. అందులోనూ తప్పులు కనిపిస్తే మరింత మందిపై చర్యలుండే అవకాశాలూ ఉన్నాయన్నారు. ఇంత మందిపై చర్యలు తీసుకోవాలన్నది తన ఉద్ధేశం కాదని, నిబంధనలు పాటించమని చెప్పడానికే ఈప్రయత్నం చేసినట్టు వివరించారు. ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తే సమస్యలు ఎదుర్కొనేది మాత్రం ఉద్యోగులేనని అన్నారు. అధికారులు ఇబ్బందుల్లో పడ్డాక ఒత్తిడి చేసిన వారేవరు వచ్చి ఆదుకోలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టంగా చెబుతోందన్నారు. కావున ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్థానికంగా లేరని ఓటు తొలగించడం కుదరదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ స్థానికంగా లేరని తొలగించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.