తప్పని తాగునీటి కష్టాలు
ప్రజాశక్తి-పలమనేరు: పలమనేరు పట్టణంలోని మొత్తం జనాభాకు ఒకటిన్నర ఏడాది వరకు నీటి నిల్వలు కౌండిన్య ప్రాజెక్టులో ఉన్నాయి. నిత్యం అధికారులు అవసరమైన నీటిని అందిస్తున్నారు. అయితే కాలనీలు, మారుమూల ప్రాంతాల వారికి మాత్రం నీటి కష్టాలు తప్పడం లేదు. మున్సిపల్ పరిధిలో మొత్తం ఆరు కాలనీలు ఉన్నాయి. అందులో గంటావూరు, గడ్డురు, షికారి కాలనీలకు నీటి సరఫరా కష్టంగా ఉంది. అక్కడ ఇంకా పైప్లైన్లు వేయలేదు. పట్టణం మొత్తం 42 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైపులైన్లు అవసరం ఉంటే 4కిలోమీటర్ల దూరం ఇంకా పైప్లైన్లు వేయలేదు. ఇంకా 20 శాతం పాత పైప్లైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. అవి లేని ప్రాంతాలకు రోజుకు 25 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడి ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం నిత్యం పడిగాపులు కాయాల్సి వస్తుంది. కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పాత పైప్లైన్ల స్థానంలో కొత్తవి వేయడానికి, పైపులైన్లు లేని ప్రాంతాలలో పైప్ లైన్ వేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. నిధులు రాగానే పనులు పూర్తి చేస్తామని తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.










