
ప్రజాశక్తి - మెళియాపుట్టి: ఆధునికత సంతరించుకుని రవాణా వ్యవస్థల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న ఈ రోజుల్లోనూ ఆదివాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. తరాలు మారినా, పాలకులు మారినా అడవి బిడ్డల బతుకులు మాత్రం మారడం లేదనడానికి మండలంలోని కేరాసింగిలో ఆదివారం చోటుచేసుకున్న డోలీ మోతే నిదర్శనం. గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. కొండలపై ఉన్న కేరాసింగి గ్రామానికి చెందిన గర్భిణి గొడ్డూరు తనూజకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. నొప్పుల తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు 108 వాహనానికి ఫోన్ చేశారు. ఆ గ్రామానికి నేటికీ పూర్తిస్థాయి రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామంలోకి వెళ్లే వీల్లేక కిలోమీటరు దూరంలోనే 108 వాహనం ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు మంచం డోలీ కట్టి కొండపై నుంచి 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను మెళియాపుట్టిలో ఆస్పత్రికి తరలించారు. వైద్యం, ఇతర అత్యవసర సమయాల్లో గిరిజనులకు ఇలాంటి అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.