Jul 20,2023 08:48

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా సర్వజనాసుపత్రి ఎదుట రోడ్డుపై తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని టిఫిన్‌, బోజనం, టీ, వంటి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించి పొట్టగొట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు కోరారు. బుధవారం ఉదయం సర్వజనాసుపత్రి వద్ద తోపుడు బండ్ల వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించే విధంగా మున్సిపల్‌ అధికారులు యత్నాలను సిపిఎం నేతలు అడ్డుకున్నారు. నగర కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ రమణారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది వచ్చి తోపుడు బండు తొలగించేందుకు యత్నించారు. దీంతో సిపిఎం నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు మాట్లాడుతూ సర్వజనాసుపత్రి వద్ద తోపుడు బండ్ల వ్యాపారులు 1980 సంవత్సరం నుంచి బండ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. తక్కువ ధరలకే టిఫిన్‌, భోజనం, టీ, పండ్లు, ఇతర సామాగ్రి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా అందుబాటులో ఆహార పదార్థాలు ఉండటంతో తక్కవ ధరలకే తీసుకుని వైద్యం చేయించుకుని వెళుతుంటారని తెలిపారు. లాభాపేక్ష ఒక్కటే వ్యాపారంగా కాకుండా సామాజిక సేవలో భాగంగా తోపుడు బండ్ల వ్యాపారులు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయని నమ్మించి తోపుడు బండ్లు తొలగించారన్నారు. పర్యటన పూర్తైన తరువాత యథాతదంగా చిరు వ్యాపరులు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుంటుంటే నగర కార్పొరేషన్‌, పోలీసు అధికారులు సర్వజనాసుపత్రి వద్ద నుంచి తోపుడు బండ్లు ఖాళీ చేయించాలని చూడటం సరికాదన్నారు. తోపుడు బండ్ల వ్యాపారులకు జీవనోపాధి, రోగులకు తక్కువ రేటుతో భోజనం లభిస్తుందన్నారు. కావున సామాజిక అవసరంగా భావించి తోపుడు బండ్ల వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించరాదని కోరారు. మొండిగా అధికారులు ఖాళీ చేయించాలని చూస్తే ఉదృతంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగర కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ రమణారెడ్డి ఆందోళన కారులతో మాట్లాడారు. తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయం ప్రాంతం చూసుకుని అక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 15 రోజులు గడువు ఇస్తున్నామని, ఆ లోపు తోపుడు బండ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, అధ్యక్షులు బాబు, రాజీవ్‌ కాలనీ ఉప సర్పంచ్‌ మసూద్‌, సిపిఎం నాయకులు ప్రకాష్‌, ఆటో యూనియన్‌ నాయకులు ఇర్ఫాన్‌, తోపుడు బండ్ల వ్యాపారుల సంగం నాయకులు రవి, కుమార్‌, వెంకటరత్నం, అనిత, నాగేంద్రమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.