ప్రజాశక్తి-శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద ఉన్న తోళ్ల పరిశ్రమను వెంటనే ప్రారంభించి శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పెట్టాలన్నారు. అలాగే పెండింగ్‌లోఉన్న బిల్లులను వెంటనే కూలీల ఖాతాల్లోకి జమచేయాలన్నారు. భూమిలేని కుటుంబాలకు మూడెకరాల భూమి కొని ఇవ్వాలని, రాచేపల్లి వద్ద ఉన్న చెప్పుల తోళ్ల పరిశ్రమను ప్రారంభించి శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కేంద్రమైన రాచేపల్లిలోనే సచివాలయాన్ని ఉంచాలన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసి, బైపిసి గ్రూపులతోపాటు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలన్నారు. ఇకపోతే సలకంచెరువు, నిదనవాడ, ఉల్లికల్లు గ్రామాల్లో శ్మశానాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన ఉల్లికల్లు గ్రామస్తులకు నష్టపరిహారం వెంటనే చెల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సుంకన్న, ఆంజనేయులు, కొండారెడ్డి, ఆంజనేయులు, జయరాముడు, శ్రీనివాసులు, సూర్యప్రకాష్, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్










