Mar 31,2023 21:41

తొలితరం మహిళా ఉద్యమ నాయకురాలు మోటూరు ఉదయంకు నివాళులర్పిస్తున్న ఐద్వా నాయకురాళ్లు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   మహిళా హక్కుల కోసం పోరాడిన తొలితరం మహిళా ఉద్యమ నాయకురాలు మోటూరు ఉదయం నిలిచారని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అన్నారు. ఐద్వా జాతీయ మాజీ నాయకురాలు మోటూరు ఉదయం వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక సిపిఎం నూతన కాలనీలో శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోటూరు ఉదయం జీవితమంతా మహిళల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన ఉక్కు మహిళా నాయకురాలు అన్నారు. బుర్రకథలో యావత్‌ రాష్ట్రాన్ని ఉర్రూత లూగించిన తొలి మహిళ అన్నారు. రాష్ట్రంలో మొట్ట మొదటి మెడికల్‌ సేల్స్‌ రెప్రజెంటేటీవ్‌గా పని చేసిన తొలి మహిళ అన్నారు. మహిళలకు మరుగుదొడ్ల సమస్యలు, మద్య పాన నిషేదం, మహిళలకు ఆస్తి హక్కు, సమానత్వం, మహిళా వ్యవసాయ కూలీలకు ప్రసూతి సెలవులు, అనాధ శరణాలయాల కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. 1983లో ఎన్‌టి.రామారావు అధికారంలోకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున మహిళల సమస్యల పరిష్కారం కోసం సభలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ని ఆహ్వానించారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా మహిళల సమస్యలపై మోటురు ఉదయం ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వినతిపత్రం అందజేశారని, ఆ డిమాండ్‌లు అన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటి పాలకులు సమస్యలపై పోరాడే వారిపై కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి విధానం పోవాలని, స్వేచ్ఛా హక్కు, వాక్‌ స్వాతంత్య్రం హక్కు కాపాడబడాలని కోరారు. మహిళలపై ఎక్కడో ఒక చోట దాడులు, హత్యచారాలు చోటు చేసుకోవడం దారుణంగా ఉందన్నారు. మోటూరు ఉదయం పోరాట స్ఫూర్తితో మహిళలకు రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యమ్రంలో ఐద్వా నాయకులు చంద్రకళ, మాబి, నసీమా, హేమలత, మున్ని, ప్రకాష్‌, బాబు, మసూద్‌ తదితరులు పాల్గొన్నారు.