
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన తనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రాధాన్యతేమీ ఇవ్వడం లేదని నరసరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్‌ఎ హనీఫ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల శిలాఫలకాల్లో, బ్యానర్లలో తన పేరు, ఫొటో ఎక్కడ లేకుండా చేస్తున్నారని చెప్పారు. వీటిపట్ల మనస్థాపానికి గురైన తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ యార్డు కార్యాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. యార్డ్ చైర్మన్‌గా 2020లో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండే ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవమానాలు ఎదురయ్యాయని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేతోపాటు జిల్లా నాయకుల దృష్టికీ తాను ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా వారు నిర్లక్ష్యంగానే వ్యవహరించారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా తాను చిత్తశుద్ధితో పదవిని నిర్వహించానని అన్నారు. పేరుతకు తాను చైర్మన్ అయినా ఎమ్మెల్యే కనుసన్నల్లో పని చేయాల్సి రావడం, ప్రాధాన్యం లేకపోవడంతో విసుగు చెందానని చెప్పారు. తన రాజీనామా లేఖను డిసిఎంఎస్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. వైసిపి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా తనకు వైసిపి పట్టణ అధ్యక్షునిగా పదవి వచ్చిందని, పార్టీకి విధేయంగానే పని చేస్తానని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి పార్టీ ఏ అభ్యర్థిని నియమించినా గెలుపునకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. శ్రీనివాసరెడ్డినే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపునకు సహకరిస్తారా? అనే విలేకర్ల ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయారు.
కాగా ఈ ఏడాది చివర్లో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి కాలం ముగియనుంది. హనీఫ్ రాజీనామాను ఆపేందుకు గురువారం ఉదయమే పట్టణంలోని ఓ ప్రముఖ నాయకుని ఇంట్లో ఎమ్మెల్యేతోపాటు రొంపిచర్ల, నరసరావుపేట మండలాల ముఖ్య నేతల సమావేశం జరిగినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హనీఫ్ రాజీనామా చేస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆపడానికి ప్రయత్నించగా హనీఫ్ తిరస్కరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేతో తాను కలిసి పనిచేయలేనని హనీఫ్ స్పష్టం చేసినట్లు సమాచారం. రాజీనామా విషయంలో ఎమ్మెల్యేకు, మరో ముఖ్యనాయకునికి వాగ్వాదం జరిగిందని సమాచారం. ఇదిలా ఉండగా ఇదే తరహాలో ఇటీవల రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన బత్తుల చిన్నమ్మాయి రొంపిచర్ల మార్కెట్ చైర్‌పర్సన్‌గా తన పదవికి రాజీనామా చేసి వారం రోజుల తర్వాత ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.