Jul 06,2023 22:13

దీక్షాశిబిరంలో మాట్లాడుతున్న ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం

         ప్రజాశక్తి-రాయదుర్గం   తొలగించిన కరోనా సమయంలో పని చేసిన 16 మంది కార్మికులతోపాటు అదనంగా తీసుకున్న మరో 9మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతటా కరోనా మహమ్మారికి భయపడి ప్రజలంతా ఇళ్లలో ఉంటే వారి ప్రాణాలను రక్షించడం కోసం తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా సేవలు చేయడానికి ముందుకొచ్చిన కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పెద్ద డ్రెయినేజీ కాలువలలో పూడికతీత కోసం అదనంగా తీసుకున్న తొమ్మిది మంది కార్మికులను కూడా తొలగించారన్నారు. ఆయా కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో ఈనెల 8న కళ్యాణదుర్గానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. వీరికి ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, సిపిఎం పట్టణ సహాయ కార్యదర్శి జి.మధు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ, తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.