తొలగించిన జాబ్ కార్డులను పునరుద్ధరించాలి
ప్రజాశక్తి-జలదంకి : తొలగించిన ఉపాది హామీ జాబ్ కార్డులను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. జలదంకి పంచాయతీలోని పూనూరు వాగు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను, కూలీల కష్టాన్ని చూసి చలించిపోయారు. ఉపాధి హామీ ద్వారా ప్రస్తుతం ఇస్తున్న కూలీ వేతనం తమకు సరిపోవటం లేదంటూ, పని భారం కూడా అధికంగా ఉందంటూ కూలీలు నాయకులు వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చారు. అక్కడ కూలీల దుస్థితిని చూసి సిపిఎం నాయకులు చలించి పోయారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కూలీలు పెంచేలా చర్యలు చేపట్టాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలతో పాటు పోరు బాట చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే వ్యవసాయ కూలీలు దగ్గర భూములు లాక్కున్నారని, వ్యవసాయం దెబ్బతిని పోయిందని, గ్రామీణ జీవితం అస్తవ్యస్తం అవుతున్న సందర్భంలో ఈ ఉపాధి హామీ పనులు కూడా లేకుండా చేయడం చాలా దుర్మార్గమని విమర్శించారు. ఉపాధి కూలీలకు 5, 6 వారాల నుంచి కూలీ డబ్బులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరువుతో అల్లాడుతున్న జలదంకి మండల ప్రజలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజువారి కూలీ రూ.600 ఇవ్వాలని, వారం వారం కూలీ డబ్బులు ఇవ్వాలని, ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించకూడదన్నారు. తొలగించిన జాబు కార్డులను వెంటనే పునరుద్ధరించాలని, ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.మధు, షేక్ బాదుల్లా, ఎస్.కె చానా, మదన్మోహన్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.










