Jul 12,2023 17:59

సిపిఎం ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - తణుకు రూరల్‌
తణుకు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్‌ రైల్వే అధికారులను డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప్రయాణికుల సమస్యలపై స్టేషన్‌ అధికారి ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే లిఫ్ట్‌ పెట్టాలని, ఎసి ధరలు తగ్గించినట్టుగా స్లీపర్‌, జనరల్‌ తరగతుల ధరలు తగ్గించాలని, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచాలని, కరోనాకు ముందున్న పాసింజర్‌ రైళ్లను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైల్వేలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచాలన్నారు. తణుకు స్టేషన్‌లో లిఫ్ట్‌ లేకపోవడం వల్ల ప్రయాణికులు ట్రాక్‌ పైనుంచి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైల్వేలో మరింత భద్రత, రక్షణ కలిగిన వ్యవస్థగా ప్రజలకు గట్టి విశ్వాసం ప్రభుత్వం కల్పించే విధంగా అధికారుల కృషి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, అడ్డగర్ల అజయకుమారి, వి.వెంకటేశ్వరరావు, పిడి.మూర్తి, కె.వీర్రాజు, కృష్ణవంశీ పాల్గొన్నారు.