Sep 08,2023 21:42

ధరలేక నార్పల వద్ద రోడ్డు పక్కన పారవేసిన టమోటాలు

      అనంతపురం ప్రతినిధి : మొన్నటి వరకు మంచి ధర ఉందని ఆనందించిన టమోటా రైతుకు మళ్లీ నిరాశే మిగులుతోంది. పంట కోతకు పెట్టిన పెట్టిబడి కూడా మిగలడం లేదు.. అరుగాలం కష్టపడి పండించిన మార్కెట్‌కు తీసుకొస్తే నో సేల్‌ అంటున్నారు. దీంతో చేసేది లేక టమోటా పంటను రోడ్లలోనే పడేసి వెనుదిరిగే పరిస్థితి జిల్లాలో నెలకొంది. అనంతపురం జిల్లాలో బోరుబావుల కింద టమోటా సాగు పెద్దఎత్తునే ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు మంచి ధర ఉండటంతో మరింత మంది రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ధర పడిపోవడంతో రైతుకు నష్టాలే మిగులుతున్నాయి.
గతేడాది కంటే తక్కువైనా ధర లేదు..
గతేడాదితో పోలీస్తే పంట సాగు చూసుకున్నా, మార్కెట్‌కు వస్తున్నా దిగుబడులు చూసుకున్నా చాలా తక్కువగానే ఉంది. కానీ ధర మాత్రం చాలా తక్కవగా ఉండటం గమనార్హం. గతేడాది ఈ సమయానికి అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాల్లో టమోటా పంటసాగైంది. ఈసారి కేవలం 11,500 ఎకరాల్లోనే సాగైంది. పంట సాగు తక్కువ అవడమే కాకుండా మార్కెట్‌కు వస్తున్న సరుకు చూసుకున్నా చాలా తక్కువనే చెప్పాలి. గతేడాది ఈ సమయానికి రోజుకు నాలుగు లక్షల బాక్సులు అనంతపురం రూరల్‌లోని కక్కలపల్లి మార్కెట్‌కు వస్తుండేవి. ఇప్పుడు ఈ మార్కెట్‌కు వస్తున్న టమోటా కేవలం ఒకటిన్నర లక్ష బాక్సులు మాత్రమే. ఇంత తక్కువగా పంట వస్తున్నా ధర మాత్రం ఉండటం లేదు.
పంట కోతకు రూ.5500... మార్కెట్‌లో అమ్మితే వచ్చింది రూ.5000...
ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన రామకృష్ణా నాయక్‌ తనకున్న ఒకటిన్నర ఎకరా పొలంలో టమోటా సాగు చేశాడు. ఇప్పుడు ఈ పంట కోతకు వచ్చింది. రెండు రోజు క్రితం రామకృష్ణా నాయక్‌ టమోటా పంట కోత కోసి మార్కెట్‌కు తీసుకొచ్చాడు. వస్తే పంట పెట్టుబడి ఎలాగున్నా... కనీసం పంటకోసి మార్కెట్‌కు తెచ్చిన ఖర్చు కూడా చేతికి రాలేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం పంట కోయగా వచ్చిన దిగుబడి వంద బాక్సులు అయ్యాయి. బాక్సుకు 15 కిలోలు. ఈ బాక్సులకు ఒక్కో దానికి రవాణా ఖర్చు పంనూరు తండా నుంచి మార్కెట్‌కు రూ.16 చొప్పున 100 బాక్సులకు రూ.1600 ఖర్చు వచ్చింది. ఇక బాక్సు బాడుగ ఒక్కో దానికి మూడు రూపాయల చొప్పున రూ.300 బాక్సుల బాడుగ. దింపడానికి హామీలీ ధర ఒక్కో బాక్సు రూపాయి. చొప్పున వంద రూపాయలు. ఇక తోటలో కాయలు కోయడానికి ఒక్కో కూలీకి రూ.300 చొప్పున పది మందికి రూ.3000. ఇక మార్కెట్‌లో అమ్మినందుకు పది శాతం కమిషన్‌ కలిపి మొత్తం రూ.5500 అయ్యింది. మార్కెట్‌లో బాక్సు రూ.50 చొప్పున అమ్ముడుపోయింది. దీనికి ఆ రైతుకు వచ్చింది రూ.5000. ఇంకా చేతి నుంచి రూ.500 రైతుకు పడింది. ఆరుగాలం కష్టపడిన రైతుకు మిగిలింది రూ.500 అదనపు ఖర్చు. ఇక అది కూడా కొనకపోతే బయటపడేసే రైతుకు మొత్తం నష్టమే మిగులుతోంది.
ఉత్తరాదిలో పంట అధికంగా వచ్చింది
రమణ, టమోటా వ్యాపారి.

ఉత్తరాది రాష్ట్రాల్లో పంట దిగుబడులు అధికంగా వచ్చాయి. దీంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సరుకు బయటకు వెళ్లటం లేదు. దీంతో మార్కెట్‌కు ముందు కంటే తక్కువ సరుకు వచ్చినా మిగిలిపోతోంది. అక్కడ వర్షాలొస్తున్నాయి. ఆ సమయంలో పంట దెబ్బతినే పరిస్థితులున్నాయి. అక్కడ పంట తగ్గితే ఇక్కడ ధర పెరిగే అవకాశముంది. సరుకు బయటకు వెళ్లకపోవడంతోనే ధర పడిపోతోంది.