అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో మదనపల్లి టమోటా మార్కెట్ తరువాత అనంతపురం మార్కెట్ అతిపెద్దది. సీజన్‌లో రోజుకు మూడు నుంచి నాలుగైదు టన్నుల వరకు టమోటా ఇక్కడికి వచ్చేది. అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి పంచాయతీ పరిధిలో ఈ టమోటా మండీలు పెద్దఎత్తున ఉన్నాయి. 30 మండీల వరకు ఇక్కడ ఉన్నాయి. వీటి సీజన్ అయిన జూన్ నుంచి ఫిబ్రవరి వరకు టమోటా పంట ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి రాష్ట్రంలో స్థానిక మార్కెట్‌లతోపాటు అటు కర్నాటక, ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరకు అనంతపురం నుంచి లారీల్లో టమోటా వెలుతూ ఉంటుంది. ఈసారి సీజన్ ప్రారంభమైనా మార్కెట్‌కు సరుకు రావడం లేదు. దీంతో అనంతపురంలోని టమోటా మార్కెట్‌లు సరుకు లేక వెలవెలపోతున్నాయి.
వాతావరణ ప్రభావం...గిట్టుబాటు ధర లేక..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల వరకు టమోటా పంట సాగవుతుంది. చిత్తూరు తరువాత అత్యధికంగా ఇక్కడే ఈ పంట సాగవుతుంది. వేసవిలో ఇక్కడ ఎండలు అధికంగానున్న సమయంలో ఈ పంట దిగుబడులు సరిగా రావు. దీంతో ఏప్రిల్, మే మసాల్లో ఇక్కడ పంట ఉండదు. ఎండలు తగ్గే సమయానికి అంటే జూన్ నాటికి పంట వచ్చే విధంగా రైతులు బోరు బావుల కింద పంటలు సాగు చేస్తారు. గతేడాది వాతావరణ ప్రభావంతో రైతులు పెద్దఎత్తున పంట నష్టపోయారు. అటు వర్షాలు, ఇటు ఎండలు రెండింటి మూలంగా దెబ్బతినడమే కాకుండా ధర కూడా ఏ ఒక్క దశలో గిట్టుబాటు లభించలేదు. దీంతో మేలో సాగు చేయాలనుకున్న రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో దిగుబడులు జూన్ నాటికి రావాల్సినవి తగినంత రాలేదు. జూన్ నాటికే టమోటా మండీలు తెరచుకున్నప్పటికీ పంట స్థానికంగా లేకపోవడంతో ఇప్పటికీ సరుకు లేక మండీలు వెలవెలబోతున్నాయి. వెయ్యి టన్నుల వరకు ఈ సమయానికి పంట వచ్చేది ఇప్పుడు అది వచ్చే పరిస్థితి లేదు. పంట లేకపోవడంతో టమోటా ధర సైతం కిలో వంద రూపాయలకు చేరింది.
వాతావరణ ప్రభావం ఉంది
రఘునాథరెడ్డి, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్.
ఈసారి ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మేలోనూ ఈ తీవ్రత కొనసాడంతో పంటల సాగుపై ప్రభావం పడింది. మేలో పెద్దగా టమోటా పంట జిల్లాలో సాగవలేదు. ఇప్పుడిప్పుడు సాగు జరుగుతోంది. ప్రస్తుతం ఎనిమిది వేల ఎకరాలకుపైగా సాగైంది. ఈ పంట వచ్చే మాసానికి దిగుబడులు వచ్చే అవకాశముంది. ఎండ తీవ్రత తగ్గుతున్న కొద్దీ పంట వస్తుంది. కాబట్టి వచ్చే రెండు మాసాల్లో టమోటా పంట వస్తే ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశాలున్నాయి.
రోజుకు 50 వేల బాక్సులొచ్చేవి
నజీర్, టమోటా వ్యాపారి.
అనంతపురం టమోటా మార్కెట్‌కు సాధారణంగా ఈ సమయానికి రోజుకు 50 వేల బాక్సులైనా టమోటా వచ్చేది. ఈసారి వెయ్యి, రెండు వేలు కూడా రావడం లేదు. వాతావరణ ప్రభావంతో రైతులు మేలో పంట సాగు చేయలేకపోయారు. దీంతో సీజన్‌లో రావాల్సిన టమోటా పంట దిగుబడి రాలేదు. ఈ ప్రభావం ధరలపైనా పడుతోంది. బయట కర్నాటకలో కొంత ఉన్నప్పటికీ స్థానిక మార్కెట్‌లకే అది సరిపోతోంది. ఇక్కడికి రావడం లేదు.
ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకనే
చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి.
పంటల సాగు, దిగుబడులు, వాటికి గిట్టుబాటు ధర కల్పించడంపై ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ఈ సమస్య వస్తోంది. గతేడాది పంటలు సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలేదు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతే పరిహారమూ సక్రమంగా అందివ్వలేదు. దీంతో రైతులు ఈ ఏడాది టమోటా సాగుపై పెద్దగా ఆసక్తి చూపేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు పంట లేకపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయి సామన్యుడిపై భారం పడుతోంది. అందుకే ప్రభుత్వాలు ధర స్థిరీకరణపై దృష్టి సారించాల్సిన అవసరముంది. డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్‌లో పంట దిగుబడులుండే విధంగా ప్రణాళిక ఉంటే ఈ సమస్య ఉండదు.










