గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
తమది రైతు ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలం పట్టింపాలెం గ్రామంలో జిల్లాలో తొలిసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి అవసరమైన అన్నింటినీ తీరుస్తున్నారన్నారు. నిరంతరం 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే జగనన్న వ్యవసాయం పండుగ అని నిరూపించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల నుంచి మద్దతు ధరకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గోనె సంచులు, హమాలీ రవాణా ఛార్జీలను సైతం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మొక్కజొన్న బయట మార్కెట్లో 1200 రూపాయలు ఉంటే ప్రభుత్వం 1600 రూపాయలకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. గత సార్వాలో జిల్లాలో 65660 మంది రైతుల నుంచి 3,76 వేల 657 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో ఒక తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 85 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ దాళ్వాలో జిల్లాలో స్థానిక అవసరాలు పోను 8.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సహకార అధికారి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 378 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు మాట్లాడుతూ ఎద్దుల బండ్లకు సైతం రవాణా ఛార్జీలు చెల్లించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ముత్యాల ఆంజనేయులు, కొమ్ముగూడెం సొసైటీ ఛైర్మన్ వెలిశెట్టి నరేంద్ర కుమార్, సెక్రటరీ శర్మ, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ ముప్పిడి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు.










