Aug 22,2023 23:21

తల్లీబిడ్డల హత్య కేసులో...
ఉన్మాదికి ఉరిశిక్ష
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
జిల్లాకేంద్రమైన చిత్తూరులో ఓ ఉన్మాది మౌలాలి (47)కి ఉరిశిక్ష పడింది.. తల్లీబిడ్డతో అక్రమ సంబంధం పెట్టుకుని విషయం వెలుగులోకి రావడంతో ఇద్దరినీ హత్య చేసినట్లుగా రుజువయ్యింది. వివరాలిలా ఉన్నాయి. తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్‌ మౌలాలి చేపలు పట్టుకుని జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన సరళమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సరళమ్మకు ముగ్గురు సంతానం. తాగుడుకు బానిసైన సయ్యద్‌ మౌలాలి సరళమ్మతో పాటు ఆమె పెద్ద కుమార్తె గంగులమ్మతోనూ తన కోర్కెలు తీర్చుకునేవాడు. విషయం తెలుసుకున్న తల్లి సరళమ్మ నిలదీయడంతో 2020లో గుట్టుచప్పుడు కాకుండా ఆమెను ఇంట్లోనే హత్యచేసి ఎవరికీ తెలియకుండా గ్రామ సమీపంలోని పెద్ద ఏరులో పడేశాడు. పిల్లలు ప్రశ్నించడంతో మీ అమ్మకు కరోనా సోకిందని, ఆస్పత్రిలో ఉందని నమ్మబలికి పిల్లలతో సహా బెంగుళూరుకు మకాం మార్చేశాడు. తన తల్లిని ఏం చేశావంటూ ప్రశ్నించిన గంగులమ్మనూ హత్య చేశాడు. ఈ సంఘటనలు 2020, ఆగస్టులో చోటు చేసుకున్నాయి. సరళమ్మ, గంగులమ్మ కనిపించకుండా పోవడంతో 2021లో సరళమ్మ సమీప బంధువు ధనమ్మ తంబళ్లపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సయ్యద్‌ మౌలాలిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరిచారు. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి నిందితుని చిత్తూరు సబ్‌జైల్‌లో ఉంచారు. విచారణ తుది దశకు వచ్చి నేరం రుజువు కావడంతో మంగళవారం చిత్తూరు ఏడిజే కోర్టు న్యాయమూర్తి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.