ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
ఈ కేసును సవాలుగా తీసుకున్న చిత్తూరు పోలీసులు 24గంటల వ్యవధిలో కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు అపహరణకు గురైన పసికందును తల్లి ఒడికి చేర్చారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో షబానా, రషీద్ దంపతుల పసికందు అదశ్యమైన విషయం విధితమే. ఈ మేరకు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పసికందు అపహరణ కావడంతో ఇతర పోలీస్‌స్టేషన్లను అలర్ట్ చేయడంతో శనివారం రాత్రి గుంటూరు బస్టాండ్ వద్ద ఓమహిళతో పాటు పురుషుడిని అదుపులోకి తీసుకుని చిత్తూరులో అపహరణకు గురైన పసికందుని ఆగంతకులు వద్ద గుర్తించారు. విషయం తెలుసుకున్న టూటౌన్ సిఐ యుగంధర్, ఎస్‌ఐ హుటాహుటిన గుంటూరుకు వెళ్లి నిందితులతో పాటు అపహరణకు గురైన బిడ్డను ఆదివారం సాయంత్రానికి చిత్తూరుకు తీసుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రి బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించి తల్లి ఒడికి చేర్చారు. నిందితులను సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు సిఐ యుగంధర్ తెలిపారు.










