నాలుగు రోజులూ స్కూలుకెళ్లిన వైనం
తిరుపతిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
మానసిక స్థితి బాగోలేదన్న మేనమామ
ప్రజాశక్తి - తిరుపతి సిటి
. ఎప్పటిలాగే ప్రతిరోజూ రెడీ అయ్యి స్కూలుకెళ్లేవాడు.. స్కూలు నుంచి రాగానే తల్లి మృతదేహం పక్కనే పడుకుని నిద్రపోయాడు.. నాలుగురోజుల పాటు తల్లి లేవకపోయినా నిద్రపోతుందనే అనుకున్నాడేమో మరి.. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో మేనమామకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. దాదాపు నాలుగు రోజుల పాటు తల్లి మృతదేహంతోనే కలిసున్నాడు. ఈ విషయమై మేనమామ మీడియాతో మాట్లాడుతూ బాలుడు శ్యాంకిషోర్ (10)కు మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పాడు. అయితే నాలుగు రోజుల పాటు ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడనే విషయాలు తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే పరిస్థితి.. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..
తిరుపతి విద్యానగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లోని మూడో అంతస్తులో రాజ్యలక్ష్మి కొడుకు శ్యాంకిషోర్‌తో కలిసి ఉంటోంది. తల్లి ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. భర్త వృత్తిరీత్యా చిత్తూరులో ఉంటున్నాడు. అయితే వీరిమధ్య కుటుంబ కలహాలతో విడాకులు తీసుకున్నారని సమాచారం. ఇంట్లో తల్లీకొడుకు మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాలతో రాజ్యలక్ష్మి నాలుగు రోజుల క్రితం మృతిచెందింది. అయితే తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకోలేని పదేళ్ల కొడుకు నిద్రపోతుందని భావించి ఆ ఇంట్లోనే ఉన్నాడు. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లి వచ్చేవాడు. ఇంత జరుగుతున్నా పక్కింటివాళ్లకూ విషయం తెలపలేదు. శనివారం తల్లి మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో మేనమామ దుర్గాప్రసాద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మేనమామ దుర్గాప్రసాద్ విషయం తెలిసిన వెంటనే ఎంఆర్‌పల్లి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మూడు రోజుల పాటు తల్లి మృతదేహంతోనే పదేళ్ల బాలుడు ఉండటం నగరంలో చర్చనీయాంశమయ్యింది.










