Jul 15,2023 22:01

రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి
ప్రజాశక్తి - తణుకు

           రాష్ట్రమంతటా నాణ్యమైన బియ్యం, కందిపప్పు నిర్దేశిత ధరలకే ట్రేడర్స్‌ ద్వారా అమ్మకాలకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణంలో బియ్యం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బియ్యం, కందిపప్పు ధరలు ఎక్కువగా ఉండటం తో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైస్‌ ట్రేడర్స్‌ అందరితో సమావేశం ఏర్పాటు చేసి నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకున్నా మన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం అమ్మకాలు ప్రారంభించారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ట్రేడర్స్‌ అందించిన సహాయ సహకా రాలు మర్చిపోలేమన్నారు. కందిపప్పును కూడా నాలుగైదు రోజుల్లో ఒక రేటు నిర్ణయించి అమ్మే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమం లో సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ టి.శివరాం పసాద్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, ఎఎస్‌ఒ రవిశంకర్‌, తహశీ ల్దార్‌ పిఎన్‌డి.ప్రసాద్‌, మాజేటి ప్రకాష్‌, ట్రేడర్స్‌ ప్రతినిధులు ఎంవి.ముత్యాలరావు, ధనుంజరు తదితరులు పాల్గొన్నారు. 
            ఉండి :ప్రభుత్వం ద్వారా తక్కువ రేట్లకే నాణ్యమైన బియ్యాన్ని అందించడం ద్వారా బహిరంగ మార్కెట్‌లోని బియ్యం ధరలకు కళ్లెం వేయవచ్చని ఉండి మండల ప్రత్యేక అధికారి ఎం.రవికుమార్‌ అన్నారు. ఉండి కో-ఆపరేటివ్‌ సొసైటీ గోడౌన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం కౌంటర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.రవికుమార్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటికి కళ్లెం వేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఎస్‌.వీరస్వామినాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ మోరంపూడి మహేష్‌ కుమార్‌, పాములపర్రు గ్రామ రెవెన్యూ అధికారి ప్రసాద్‌ పాల్గొన్నారు.