Jul 28,2023 21:41

ఆందోళనలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవలు అందిస్తున్న అటవీశాఖ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టిటిడి కార్మికులు చేపట్టిన నిరసనలు వెయ్యి రోజులకు చేరుకున్న నేపథ్యంలో వారికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జి.ఓబులు మాట్లాడుతూ 200 మంది అటవీశాఖ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెయ్యి రోజులుగా దీక్షలు చేపడుతున్నా పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవరించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేలా టీటీడీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ టిటిడి బోర్డు నేతృత్వం, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 25 ఏళ్లుగా అటవీ కార్మికుల శ్రమను దోపిడీ చేసి ఇప్పుడు వీధిపాలు చేయడం చాలా అన్యాయంగా ఉందన్నారు. టిటిడిలో అటవీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరిని తక్షణం మార్చుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఆర్‌ఒ గాయత్రీదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, శ్రీ సత్యసాయి, శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తిప్పేస్వామి, శ్రీనివాసులు, నాగరాజు, రామాంజనేయులు, ఒన్నూరప్ప, ఈశ్వరయ్య, మధు, రవీంద్ర చారి, తిరుపాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.