Mar 15,2022 22:11

రైల్వే స్టేషనలో కలంకారీ షాపులు


పైలెట్‌ ప్రాజెక్టుగా 'వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌'
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిషోర్‌ వెల్లడి
మార్చి 25న 'కలంకారి' స్టాల్‌ ప్రారంభానికి ఏర్పాట్లు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో:
కలంకారి చీరలు, వస్త్రాలను ప్రోత్సహించేలా ఈ స్టేషన్‌ను ఎంపిక చేశారు. ఉద్‌ క్రాఫ్టింగ్‌ వంటి ఇతర బహుళ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి అనుమతి ఇవ్వనున్నారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈనెల 25న స్టాల్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను జనరల్‌ మేనేజర్‌ వెల్లడించారు. ఈ అవకాశాన్ని తిరుపతి పరిసర ప్రాంతాల కళాకారులు, క్రాఫ్ట్‌ కళాకారులు ముఖ్యంగా కలంకారి చీరలు, వస్త్ర, వుడ్‌, క్రాఫ్టింగ్‌ కళాకారులు వినియోగించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశంతో పాటు నూతన ప్రాంతాలకు మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. స్థానిక పరిశ్రమలను పటిష్టపరచాలనే ప్రధాన లక్ష్యంతో స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి రైల్వేస్టేషన్‌ను ఒక హబ్‌గా, ప్రదర్శన శాలగా రూపొందించాలనేది ఈ విధాన ప్రధాన లక్ష్యమన్నారు. ప్రారంభ దశలో 15 రోజులు పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు పరిచేందుకు ప్రతి జోనల్‌ రైల్వేలో ఒక స్టేషన్‌ గుర్తించాలని రైల్వే బోర్డు సూచించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి బాలాజీ దేవాలయం సందర్శనార్ధం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి స్టేషన్‌ నిత్యం రద్దీతో ఉంటుంది. తదనుగుణంగా కలంకారి చీరలు, వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ స్టేషన్‌ను ఎంపిక చేశారు. రోజుకు దాదాపు నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ ఫీజు 500 రూపాయల చెల్లింపుతో స్టాల్‌ కేటాయిస్తారు. పైలెట్‌ ప్రాజెక్టుకు రైల్వే వారిచే తాత్కాలిక పద్ధతిన స్టాల్‌ ఏర్పాటు చేస్తారు. నీటిసరఫరా, విద్యుత్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తారు. రైలు దిగే, ఎక్కే ప్రాంతాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో స్టాల్‌, కియోస్క్‌ ఏర్పాటు చేస్తారు. విక్రయదారులకు గుర్తింపు కార్డును రైల్వే సూపరింటెండెంట్‌ ఇస్తారు. స్టాల్స్‌ కేటాయించిన వారు ప్లాట్‌ఫారంపై అమ్ముకోవచ్చు. తదుపరి స్టేషన్‌ వచ్చే వరకూ రైళ్లలోనూ అమ్ముకోవచ్చు. డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించబడతాయి. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌, ఎన్జీవోలు, కోఆపరేటివ్‌ డీలింగ్స్‌ వారి సహకారంతో గుర్తింపు పొందిన వారినీ ఎంపిక చేస్తారు. ఆసక్తి గలవారు గుంతకల్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌కు వారి ఉత్పత్తుల వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తే బహిరంగ లాటరీ, బహిరంగ డ్రా విధానం ద్వారా మాత్రమే కేటాయిస్తారు.